భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కొందరు ఇండియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ..పాకిస్తాన్‌కు భారతదేశానికి సంబంధించిన సమాచారం ఇస్తూ, సోషల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటివారిపై కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ పెట్టడంతో ఒక్కొక్కరి బండారం బట్టబయలు అవుతోంది. తాజాగా సర్కార్ కొలువులో ఉన్న వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐకు సమాచారం ఇస్తూ దొరికిపోయాడు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు మరువక ముందే, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలపై మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడిని భారత నిఘా సంస్థ అరెస్టు చేసింది. రవి కుమార్ వర్మ అనే యువకుడిని మహారాష్ట్ర ATS అదుపులోకి తీసుకుంది. థానేలోని కల్వా నివాసి అయిన రవి, నావల్ డాక్‌లో జూనియర్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అయితే 14 భారతీయ జలాంతర్గాములు, యుద్ధనౌకల గురించి పాకిస్తాన్‌కు సమాచారం అందించాడని రవిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రవిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ, ఈ సమాచారాన్ని పాకిస్తాన్‌కు ఎలా అందించాడని ప్రశ్నిస్తున్నారు.
మహారాష్ట్ర ATS నుండి అందిన సమాచారం ప్రకారం, రవి కుమార్ వర్మ పాకిస్తాన్ నిఘా సంస్థ ISIకి చెందిన రెండు ఫేస్‌బుక్ ఖాతాలతో సంప్రదింపులు జరిపాడు. ఈ రెండు ఫేస్‌బుక్ పేజీలు పాయల్ శర్మ, ఇస్ప్రీత్ పేరిట సృష్టించబడ్డాయి. ఈ రెండు ఫేస్‌బుక్ పేజీలలో, రవి వర్మ 14 జలాంతర్గాములు, యుద్ధనౌకల గురించి సమాచారాన్ని పంచుకున్నాడు. యుద్ధనౌకలు, ఇతర నౌకల ముఖ్యమైన సమాచారం, ఛాయాచిత్రాలను కూడా రవి పంపినట్లు మహారాష్ట్ర ATS అధికారులు గుర్తించారు.
నావల్ డాక్ ప్రాంతంలో మొబైల్ ఫోన్లు నిషేధించినందున, రవివర్మ అక్కడి యుద్ధనౌకల డిజైన్లు, ఇతర వివరాలను గుర్తుంచుకునేవాడు. అప్పుడు అతను పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఫేస్‌బుక్ పేజీలలో వాటి సమాచారాన్ని పంచుకునేవాడు. రవి ఈ సమాచారాన్ని ఆడియో, టెక్ట్స్ ఫార్మాట్‌లో పంపేవాడని దర్యాప్తులో తేలింది.
రవివర్మ నవంబర్ 2024 నుండి పాకిస్తానీ ఫేస్‌బుక్ ఖాతాతో సంప్రదింపులు జరుపుతున్నాడు. పాయల్ శర్మ, ఇస్ప్రీత్ పేరిట పాకిస్తానీ నిఘా ఏజెంట్ల ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించారని మహారాష్ట్ర ATS తెలిపింది. రెండు పేజీల నుండి, రవివర్మను ఒక ప్రాజెక్ట్ కోసం యుద్ధనౌకల గురించి సమాచారం అడుగుతున్నారు. హనీట్రాప్‌లో చిక్కుకున్న రవివర్మ, ఈ సమాచారాన్ని పాయల్ శర్మ, ఇస్ప్రీత్‌లకు పదే పదే పంపుతున్నట్లు గుర్తించారు.
ఇదిలావుంటే, రవి వర్మకు సంబంధించి మరో ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. రవి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ ATS అతన్ని అరెస్టు చేసిన తర్వాత అతని వివాహం రద్దు అయ్యినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే, అతని తల్లి ఆ సంబంధాన్ని ఖరారు చేసింది. దేశ ద్రోహం చేసిన వ్యక్తికి తమ కూతురిని ఇచ్చి వివాహం చేయబోమని ఆ అమ్మాయి కుటుంబం తేల్చి చెప్పింది. నిశ్చితార్థం మాత్రమే జరిగి, రవి రహస్యం బయటపడటం మంచిదైంది. ఆ వివాహం జరిగి ఉంటే, అతని కూతురి జీవితం నాశనమై ఉండేదన అమ్మాయి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.