బీఆర్ఎస్ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో రూ. కోట్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆడిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2017 నుంచి 2020 మధ్య కాలంలో బిల్లులు, లెక్కా పత్రాలు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన ఖర్చు చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోలు విధానాల ఉల్లంఘన, ఒప్పంద నిబంధనల్లో తేడాలు, అధికార దుర్వినియోగం (ప్రత్యేకంగా కార్యదర్శి ద్వారా), సేవల ధ్రువీకరణ లేకుండా చెల్లింపులు, లోపభూయిష్ట వస్తువుల స్వీకరణ, కాంట్రాక్టర్లతో సంభావ్య సహకారం వంటివి ఉన్నాయి. అయితే ఆ సమయంలో గురుకులాల సెక్రెటరీగా ప్రస్తుతం బీఆర్ఎస్ నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడం గమనార్హం.
అనుమతి లేకుండా అధిక చెల్లింపులు
కోడింగ్ స్కూల్స్ ప్రాజెక్టులో ఏడాదికి రూ.4 కోట్లు ఖర్చు చేసిన పనులకు అనుమతులు లేకుండానే రూ.92 లక్షలు అధికంగా చెల్లించారని ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. రెండు స్కూళ్లకు మాత్రమే అనుమతి ఉన్నా.. స్థలాలు లేదా స్కూళ్ల సంఖ్యను వివరించకుండా ఒప్పందం చేసుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. టెండర్లు ఈ-ప్రొక్యూర్ మెంట్ ద్వారా నిర్వహించకపోవడం, విద్యార్థుల సంఖ్య, సిబ్బంది, అర్హతల వంటి కీలక నిబంధనలను పూర్తిగా విస్మరించి అమలు చేశారని గుర్తించారు. బ్యాంక్ గ్యారెంటీ లేకుండానే 90 శాతం ముందస్తు చెల్లింపులు చేశారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత కార్యదర్శి స్వయంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను మాఫీ చేయడం ద్వారా టెండర్ నిబంధనలను మార్చారని, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమేనని రిపోర్ట్ లో పొందుపర్చారు. కేవలం ఒక స్కూల్, ఒక కాలేజ్ మాత్రమే స్థాపించబడి పనిచేస్తున్నా, రెండు స్కూళ్లు, ఒక కాలేజ్ కోసం చెల్లింపు చేయడం ద్వారా రూ.97.20 లక్షల అధిక చెల్లింపులు చేశారని, తప్పుడు టీడీఎస్ రేట్లు వర్తింపజేయడం ద్వారా పన్ను ఎగవేతకు అవకాశం కల్పించారని నివేదికలో పేర్కొన్నారు.
నాణ్యత లేని యూనిఫామ్స్, ఇష్టారీతిన వ్యవహారాలు
‘టాపర్ లైసెన్సులు’ ప్రాజెక్టు ఖర్చు ఏటా రూ. 20.29 కోట్లు అని టెండర్ లేదా ఒప్పందంలో పేర్కొనకుండా ఈ-ప్రొక్యూర్ మెంట్ నుంచి తప్పించారు. సీటీఓ సేవల స్వీకరణను ధ్రువీకరించకుండా సర్టిఫికెట్ జారీ చేశారు. లైసెన్సుల వినియోగంపై ఎటువంటి డేటా లేకుండా ఏజెన్సీకి రూ.2.03 కోట్లు చెల్లించారని ఆడిట్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. డెలివరీ ధ్రువీకరణకు ముందే బ్యాంక్ గ్యారెంటీ విడుదల చేయడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించారని వివరించారు. రైట్స్ లిమిటెడ్ పరిశీలనలో యూనిఫామ్స్ నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో తిరస్కరించారని, అయినా వాటిని స్వీకరించి పంపిణీ చేశారని ఆడిట్ రిపోర్ట్ లో వివరించారు. అంతేకాకుండా రూ.9.33 కోట్లు చెల్లించి సరఫరాదారునికి అనుచిత లాభాన్ని కల్పించారని పేర్కొన్నారు. 2017-18లో అనుమతించిన రేట్లకు బదులుగా 2021 రేట్లను వర్తింపజేయడం ద్వారా రూ.76.89 లక్షల అధిక చెల్లింపులు చేశారని నివేదికలో వెల్లడించారు.
విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలో..
విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలో రూ.1.38 కోట్ల అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. టెండర్ ప్రక్రియ ఈ-ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహించకపోవడం, ఐఎస్‌ఐ సర్టిఫికెట్లు, అనుమతులు లేని సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడం వంటివి చేశారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. వారంటీ అనేది ఆర్డర్ తేదీ నుండి ప్రారంభమవడం వల్ల, డెలివరీ తర్వాత వచ్చిన లోపాలపై వారంటీ వర్తించలేదని, దీంతో రూ.1.38 కోట్ల విలువైన లోపభూయిష్ట వస్తువులు మార్చలేకపోయారని, ఒప్పందాలు లేకుండా చెల్లింపులు చేశారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. డైట్, క్లీనింగ్, పరీక్షా ఫీజుల కోసం సరైన ఒప్పందాలు లేకుండా చెల్లింపులు నమోదయ్యాయని, పలు బిల్లులు గల్లంతు కావడం లేదా లెడ్జర్లతో అసమానతలు ఉండడం ద్వారా నిధుల దుర్వినియోగం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆడిట్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.