అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి నగదు అక్రమ లావాదేవీల కేసులో నిందితుడిగా ఉన్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైకేల్ జేమ్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
6 సంవత్సరాల 6 నెలలుగా తిహాడ్ జైలులో ఉంటున్న ఆయనకు ఈ నెల 22న దిల్లీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే బయటకు వచ్చాక దేశంలో ఆయన నివసించబోయే చిరునామాను సమర్పించిన తర్వాతే బెయిలు వస్తుందని పేర్కొంది. ఈ నిబంధనను సవాలు చేస్తూ జేమ్స్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపింది.
‘మీకు అనుకూలంగా కోర్టు బెయిలు మంజూరు చేసింది. మేము నిర్దేశించిన నిబంధనలను మీరు పాటించలేరా’ అని పిటిషనరు తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనరు గత కొన్నేళ్లుగా జైలులోనే ఉంటున్నారని, అతడు బయటకు వచ్చిన తర్వాతే చిరునామా ఇవ్వగలమని నివేదించారు. పిటిషన్‌దారు బ్రిటన్ పౌరుడు అయినప్పటికీ కోర్టులో మీ ద్వారా వాదించగలుగుతున్నారని..
ఆయనకు పరిచయాలు బాగానే ఉంటాయని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘మీరు ఓ చిరునామా ఇవ్వొచ్చు కదా’ అని సూచించింది. జేమ్స్‌కు బ్రిటన్ హైకమిషన్ న్యాయ సలహా అందిస్తోందని ఓ దశలో న్యాయవాది చెప్పడంతో.. ఈ సమస్యకూ పరిష్కారాన్ని వారే చూసుకుంటారని స్పష్టం చేసింది. లేకపోతే ‘తిహాడ్ జైలే పిటిషనరు శాశ్వత చిరునామాగా ఉంటుంది. ఆయన అక్కడే ఉంటారు’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.