ఆపరేషన్ సిందూర్‌పై కొలంబియా తీరు విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. స్వీయ రక్షణ చర్యలు చేపట్టే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులను రెచ్చగొట్టే శక్తులను, స్వీయరక్షణ చర్యలు తీసుకునే వారిని ఒకేగాటన కట్టడం సబబు కాదని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్‌లో మరణించిన వారికి కొలంబియా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ వెనక గల కారణాలను కొలంబియాకు వివరించేందుకు శశి థరూర్ సారథ్యంలోని బృందం అక్కడ పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో పాల్గొన్న శశి థరూర్.. కొలంబియా ప్రభుత్వ స్పందన విచారం కలిగించిందని అన్నారు. ఉగ్రవాద బాధితుల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారనేందుకు భారత్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఎంపీ శశి థరూర్ అన్నారు. ‘స్వీయ రక్షణకు మాకున్న హక్కును వినియోగించుకున్నాం. కొలంబియా దేశం వలెనే ఎన్నో ఉగ్రదాడులను ఎదుర్కొన్నాము. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో దాడులను ఎదుర్కొన్నాము’ అని శశి థరూర్ అన్నారు. ‘పాక్ ఆయుధ సంపత్తి స్వీయ రక్షణ కోసం కాదు, దాడుల కోసమే. మా యుద్ధం మాత్రం ఉగ్రవాదంపైనే’ అని అన్నారు.
పనామా, గయానా దేశాల పర్యటన అనంతరం ఎంపీ శశి థరూర్ సారథ్యంలోని భారత దౌత్య బృందం గురువారం కొలంబియాకు చేరుకుంది. ఈ బృందంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్, జీఎమ్ హరీశ్ బాలయోగి (టీడీపీ), శశాంక్ మణి త్రిపాఠీ (బీజేపీ), భువనేశ్వర్ (బీజేపీ), మిలింద్ దియోరా (శివ సేన), తేజస్వీ సూర్య (బీజేపీ), మాజీ రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆవస్యకతను ప్రపంచదేశాలకు వివరించేందుకు భారత్.. వివిధ పార్టీల ఎంపీలు, నేతలతో కూడిన 7 బృందాలను పంపించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్ మే 8, 9, 10 తేదీల్లో దాడికి యత్నించగా భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ మిసైల్ దాడులకు తల్లడిల్లిపోయిన పాక్ చివరకు కాల్పుల విరమణ పాటిద్దామని ప్రతిపాదించింది. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.