ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ప్రతి ఏటా జరిగే హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్‌లోని చివరి నెలలో నెలవంక దర్శనం ఆధారంగా హజ్ యాత్ర తేదీలను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.
ప్రతి ఏటా ఈ తేదీలు మారుతుంటాయి.
ఈ ఏడాది జూన్ 4 నుంచి నాలుగు రోజులపాటు హజ్ యాత్ర కొనసాగుతుంది. ఇందులో రెండో రోజు అంటే జూన్ 5న అరాఫత్ మైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో హజ్ యాత్రికులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. మహమద్ ప్రవక్త చివరి ఉపన్యాసం ఇచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు. జూన్ 6న ఈద్-అల్-అధాను జరుపుకుంటారు. ఈసారి హజ్ యాత్రలో దాదాపు పది లక్షల మంది ముస్లింలు పాల్గొంటారని అంచనా.