మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మిత్రపక్షాలైన శివసేన(యూబీటీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సావర్కర్ వ్యవహారం రాజకీయ రచ్చ రేపింది.
స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్‌పై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. నాసిక్ నగర విభాగం శివసేన అధ్యక్షుడు బాలా దరాదే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ముఖానికి నల్ల రంగు పూస్తామని, ఆయన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా.. కాన్వాయ్‌పై రాళ్లు రువ్వుతామని దరాదే ప్రతిజ్ఞ చేశారు. సావర్కర్ జన్మించిన ప్రాంతంలో తాము జీవిస్తున్నందుకు గర్వంగా ఉంద ని పేర్కొన్నారు.
‘మాఫీ-వీర్’ అంటూ.. సావర్కర్‌ను రాహుల్ సంబోధించడం ఆయనను తీవ్రంగా అవమానించడమేనన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసినట్టు తెలిపారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని వ్యాఖ్యానించారు. కాగా.. దరాదే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని శివసేన అధికార ప్రతినిధి సుష్మా అంధారే ప్రకటించారు. మరోవైపు దరాదే వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఇలాంటి హెచ్చరికలను సమర్థవంతంగా తిప్పికొడతామని మహారాష్ట్ర పీసీసీ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ అన్నారు.