Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టు ముందు విడ్డూరపు నాటకం

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున ప్రస్తావనగా మళ్లీ దాని పరిశీలనకే పంపడం ద్వారా ఢిల్లీలో ఒక చవకబారు ప్రహసనం ఆవిష్కృతమవుతున్నది.

రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయిస్తూ అదివరలో ఇచ్చిన తీర్పుపై వివరణ కోరుతూ ఈ ప్రస్తావన పంపడం మహా విడ్డూరపు నాటకం తప్ప మరొకటి కాదు. కోర్టు మొదట ఇచ్చింది…నిరంకుశ ఏకపక్ష ఉత్తర్వు ఏమీ కాదు. అనేక తీర్పుల ద్వారా రూపొందిన సుస్థాపితమైన న్యాయసూత్రాల మార్గ్గంలో వున్నదే.
తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వ్యవహరించిన తీరుపై అదివరలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై 14 ప్రశ్నలు లేవనెత్తుతూ 143(1) అధికరణం కింద రాష్ట్రపతి ఈ ప్రస్తావన పంపించారు. శాసనసభ ఆమోదించిన 14 బిల్లులకు అంగీకార ముద్ర వేయకుండా గవర్నర్‌ అంతులేని జాప్యం చేయడంపై తమిళనాడు ప్రభుత్వమే కోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ నిర్మాతలూ వచ్చిన బిల్లులపై ‘సాధ్యమైనంత తొందరగా’ సంతకం చేయాలని గౌరవప్రదంగా పేర్కొన్నారు. కావాలనే కాల వ్యవధి అన్న పదం వాడకుండా సాధ్యమైనంత తొందరగా అన్న ఈ పదం వాడారుగానీ దాని అర్థం ఎడతెగని జాప్యం చేయవచ్చని కాదు. మరికొన్ని ఇతర రాజ్యాంగాల వలెగాక మన రాజ్యాంగం ప్రకారం కోర్టు అభిప్రాయాన్ని కోరే నిబంధన స్పష్టంగానే పేర్కొనబడింది. రాష్ట్రపతి మాత్రమే కాదు. ఒక పౌరుడు కూడా కోర్టు అభిప్రాయం అడగవచ్చును. రాష్ట్రపతి అడిగినంత మాత్రాన కోర్టు అధికార పూర్వకంగా లోబడి వుండాలనేమీ లేదు.
చాలా లెక్కలతోనే…
వాస్తవాలు ఇలా వున్నప్పుడు కేంద్రం ఈ రాజకీయ సన్నివేశాన్ని సృష్టించడం చాలా తీవ్రమైన లెక్కలతోనే జరిగిందని భావించాల్సి వస్తుంది. బిజెపి యేతర ప్రభుత్వాలు తమ శాసనాధికారాన్ని ఉపయోగించడం మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదు. కనుకే సుప్రీంకోర్టు ఉత్తర్వుపై దానికి మినహాయింపులు వుండటమే కాదు. అసలు ఏ మాత్రం మింగుడు పడలేదేమోనని భావించవలసి వస్తుంది.
తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఎలాంటి హడావుడి లేదు సరికదా గవర్నర్‌ నిగూఢమైన నిశ్శబ్దం పాటిస్తున్నారు. కానీ జగడాలమారి ఉపరాష్ట్రపతి మాత్రం రాజకీయ తగాదాకు తెరతీశారు. సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంటుగా మారిపోయిందని ఆయన నోరు పారేసుకున్నారు. మరోవైపు చూస్తే గవర్నర్‌ రవి అసలేమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు ఆయనకు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా వుండే హక్కు లేకుండా పోయినప్పటికీ ఆయన మాత్రం అందమైన పర్వత విడిదిలో వైస్‌ ఛాన్సలర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ రెండు మార్గాలు వదలి…
మామూలుగా ఏదైనా తీర్పుపై అసంతృప్తి ఏర్పడినట్టయితే సమీక్షించాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు నిర్ణయానికి అతీతంగా మరే అప్పీళ్లు వుండవు. అరుదైన సందర్భాల్లో ఉపశమనం కలిగించమని కోరుతూ క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయొచ్చు. మరో మార్గం ఏమంటే ఆ తీర్పు ప్రభావం తోసిపుచ్చేలా పార్లమెంటులో మరో చట్టం చేయవచ్చును. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం సెర్చి కమిటీ ఎలా వుండాలన్న అంశంలో ప్రభుత్వం చేసిందదే. కానీ ఈ సందర్భంలో ప్రభుత్వం అలాంటి అవకాశాలు వేటినీ ఉపయోగించుకోలేదు. ఇలాంటి అంశాల్లో సంప్రదింపులు జరపాల్సిన అటార్నీ జనరల్‌తోనూ మాట్లాడలేదు.
ఒరిగేదేంటి?
గందరగోళం లేకుండా ఒక విషయం స్పష్టం చేయాలి. 74వ అధికరణానికి 42వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్‌ సలహా ప్రకారం నడుచుకోవడం అనివార్యమే. కనుక ప్రస్తుతం రాష్ట్రపతి పంపిన ప్రస్తావన రాజకీయ సంకేతం తప్ప మరొకటి కాదు. సాధ్యమైనంత తొందరగా అన్న పద ప్రయోగం కాల వ్యవధిని సూచిస్తుందని సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యానంతో తాను అంగీకరించడం లేదనే సందేశం ప్రభుత్వం పంపదల్చుకుంది. ఈ తిరస్కారం సువ్యవస్థితమైన న్యాయ సూత్రాలకు విరుద్ధం. 1974లో షంషేర్‌ సింగ్‌ కేసులో గవర్నర్లు ఎన్నికైన రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకే పనిచేయాలని స్పష్టం చేయబడింది. బ్రిటన్‌ లేదా అమెరికా అధ్యక్షుల వలె వారు ఇష్టానుసారం వ్యవహరించలేరని చెప్పింది.
అసలు దాడి
ఈ విధంగా మనం చాలా విడ్డూరమైన రాజకీయ నాటకంలో చిక్కుకు పోయాం. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నలపై స్పందించి తీరాల్సిన అవసరం లేదు. ఒక వేళ స్పందించినా ఆ అభిప్రాయాలకే కట్టుబడి వుండనవసరం లేదు. మోడీ ప్రభుత్వం చాలా గొప్ప విషయంలా చేసిన ఈ తతంగం ఎందుకో మరీ ముఖ్యంగా అది ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో దాని బండారమేమిటో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇది కేవలం రాజకీయ నాటకం మాత్రమే అనుకోవడం అమాయకత్వమే. ప్రభుత్వం హిందూత్వ భావజాల పరంగా నడుస్తున్నది. భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి, అందులోని ఏర్పాట్లకు ఆ భావజాలం వ్యతిరేకమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర సిద్ధాంతకారుడైన ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ సమాఖ్యతత్వం అనేదాని నిజమైన స్ఫూర్తిని ఏనాడూ ఆమోదించలేదు. చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్రీకృత యూనిటరీ తరహా ప్రభుత్వం వుండాలని ఎప్పుడూ చెబుతూ వచ్చారు.
మూల సిద్ధాంతాలపైనే దాడి జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో అందుకు అడ్డుపడే బలమైన శక్తిగా రాజ్యాంగం నిలిచి వుందనేది ఈ విడ్డూరపు రాజకీయ నాటకంలో మరోసారి స్పష్టమవుతున్నది. సాధ్యమైనంత త్వరగా అన్న మాట వెనక అసలైన లక్ష్యం ఏమిటనేదానిపై రాజ్యాంగపర వ్యాఖ్యానం తెలుసుకోవడం ఇక్కడ అసలైన లక్ష్యం కాదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన చట్టసభల సార్వభౌమిక అధికారాన్ని దెబ్బ తీయాలన్నదే అసలైన ఉద్దేశం.

 

Related posts

హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు

M HANUMATH PRASAD

జర్నలిజం ముసుగులో జగన్ పై అబ్బద్దాల దాడి- వైసీపీ నేత కారుమూరి వెంకట రెడ్డి

M HANUMATH PRASAD

మతం మారితే రేజర్వేషన్లు ఉండవు, రెండు కావాలంటే కుదరదు ఏపీ హైకోర్టు ధ్రువీకరణ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

GIT NEWS

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు

వల్లభనేని వంశీకి అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు?

M HANUMATH PRASAD