- దేశవ్యాప్తంగా 21 మంది జడ్జిల బదిలీకి ప్రతిపాదన
- తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా ఏకే సింగ్!
హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): గతంలో తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పనిచేసి వివిధ రాష్ట్రాలకు బదిలీ అయిన ముగ్గురు జడ్జిలు మళ్లీ ఇక్కడికి రానున్నారు. జస్టిస్ సి.సుమలత, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలను ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో జడ్జిలుగా వ్యవహరిస్తుండగా.. జస్టిస్ అభిషేక్‌రెడ్డి పట్నా హైకోర్టులో సేవలందిస్తున్నారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించిన వెంటనే వారు మళ్లీ తెలంగాణ హైకోర్టులో జడ్జిలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. కాగా, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ఇక త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్న అపరేశ్ కుమార్‌సింగ్ (ఏకే సింగ్)ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి కొలీజియం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. 1965 జూలై 7న జన్మించిన జస్టిస్ ఏకే సింగ్.. 1990 నుంచి పట్నా హైకోర్టులో న్యాయవాదిగా, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2001 నుంచి 2012 వరకు జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022లో జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించి.. 2023లో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయనను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది.
గోల్డ్‌మెడలిస్ట్ జస్టిస్ సుమలత..
కాన్‌స్టిట్యూషన్ లాలో గోల్డ్‌మెడలిస్ట్ అయిన జస్టిస్ చిల్లకూరు సుమలత.. వెంకటసుబ్బయ్య, లక్ష్మీప్రసన్న దంపతులకు జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న అనంతరం న్యాయవాదిగా పదేళ్లపాటు పనిచేసి 2007లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. కర్నూలు, గుంటూరు, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. 2021 అక్టోబరు 15న తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2023 నవంబరు 23న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా, గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామానికి చెందిన జస్టిస్ కన్నెగంటి లలిత.. హైదరాబాద్ ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా స్కూల్‌లో పాఠశాల విద్య, ఎస్సార్ నగర్‌లోని నాగార్జున జూనియర్ కాలేజీలో ఇంటర్, నాంపల్లి సరోజినీ నాయుడు మహా విద్యాలయలో డిగ్రీ, పడాల రామిరెడ్డి లా కాలేజ్‌లో న్యాయశాస్త్రం చదివారు. 1994లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. 2020 మే 2న ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టుకు, 2023లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.
రంగారెడ్డి జిల్లా వాసి జస్టిస్ అభిషేక్‌రెడ్డి
జస్టిస్ జస్టిస్ అభిషేక్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది ఎ. పుల్లారెడ్డి, డాక్టర్ శశిరేఖారెడ్డి దంపతులకు 1967లో జన్మించారు. హైదర్‌గూడ సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్, నిజాం కాలేజీలో డిగ్రీ, ఓయూ లా కాలేజ్‌లో న్యాయశాస్త్రం పూర్తిచేసి 1990లో అప్పటి ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1952 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ అత్యంత సీనియర్ సభ్యుల్లో ఒకరైన ఆయన తండ్రి పుల్లా రెడ్డి చాంబర్స్‌లోనే వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2023లో పట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు.