రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కినంత మాత్రాన ఎలాంటి హక్కు లేదా టైటిల్ సంక్రమించదని హైకోర్టు స్పష్టం చేసింది.
భూమి వర్గీకరణ, పంటల స్వభావం, భూమి శిస్తు (పన్ను) కోసం మాత్రమే పహాణీల్లో పేర్ల నమోదు లేదా రెవెన్యూ ఎంట్రీలు ఉపయోగపడతాయని పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలను ఎప్పుడూ రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌ఓఆర్)గా భావించరాదని తెలిపింది. రెవెన్యూ ఎంట్రీల వల్ల ఎలాంటి హక్కులు సంక్రమించబోవని, ప్రస్తుతం ఉన్న హక్కులు హరించుకొని పోవని పేర్కొంది. భూమిపై హక్కు ఎవరిది అనేది సంబంధిత సివిల్ కోర్టులోనే తేలుతుందని స్పష్టంచేసింది.
పెద్దపల్లిలోని ఓదెల గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన 14.05 ఎకరాల భూమికి సంబంధించి 2018లో పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీచేసి.. ఆ తర్వాత తమ పేర్లను తొలగించడం చెల్లదని పేర్కొంటూ ఆలయ పూజారి ఆరుట్ల నర్సింహాచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. ఆ వివాదాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని సూచించింది