తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీలో చాలా కాలంగా రాజుకుంటున్న అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగంగా బయటపడింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.
ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యలపై బుచ్చయ్య చౌదరి ఫైర్:
తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు తన ఘనతేనని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. తెలుగు విశ్వవిద్యాలయానికి భూముల కేటాయింపులో తాను కూడా భాగస్వామిని అని ఆయన గుర్తు చేశారు. 1985లోనే నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్వయంగా ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. అంతేకాదు, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలు సైతం ఎన్టీఆరే రచించారని, అయితే భూముల కేటాయింపులో తాను కీలక పాత్ర పోషించానని తెలిపారు.
తాను పడిన శ్రమను వివరించిన బుచ్చయ్య చౌదరి:
రాష్ట్ర విభజన తర్వాత 2014-2019 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చాలాసార్లు చర్చించి, తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్రానికి రావడానికి తాను చాలా కృషి చేశానని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు. “నా చరిత్ర తెలియకుండానే కొందరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే… ఎవరో కన్న బిడ్డకు తండ్రిని తానే చెప్పుకున్న సామెత గుర్తొస్తోంది” అంటూ ఆదిరెడ్డి వాసుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజమండ్రి అభివృద్ధిలోనూ తన పాత్ర చాలా ఎక్కువగా ఉందని, ఎవరూ ఖండించలేరని ఆయన నొక్కి చెప్పారు.
‘అభివృద్ధి ఎక్కడ?’ అంటూ సెటైర్లు:
గత ఏడాది కాలంలో రాజమండ్రిలో ఏం అభివృద్ధి జరిగిందని, కేవలం ఫ్లెక్సీలు కట్టుకుని, డబ్బాలు కొట్టుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. రాజమండ్రి టీడీపీలో ఈ అంతర్గత పోరు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంద