రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ అరెస్టు ఖాయమన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది.
లిక్కర్ స్కాంలో నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో జగన్ అరెస్టుకు సిట్ రంగం సిద్ధం చేస్తోందని కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. లిక్కర్ స్కాంలో జగన్ పాత్రపై చర్చించామని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారని, నేడో రేపో ఆయన అరెస్టు కావచ్చనే ప్రచారం ఉవ్వెత్తున జరుగుతోంది. అయితే ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల్లో జగన్ ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసే లేదన్న వాదన కూడా అంతే ఎక్కువగా సాగుతోంది. జగన్ ను అరెస్టు చేయడమంటే కూటమి ప్రభుత్వం చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లేనని అంటున్నారు. అందుకే ఎప్పటి నుంచో జగన్ ను అరెస్టు చేస్తామని లీకులు ఇస్తున్నా, ఆయనను టచ్ చేయడం లేదని అంటున్నారు.
అరెస్టు ప్రచారంపై జగన్ కూడా రెండు రోజుల క్రితం స్పందించారు. తనను అరెస్టు చేయగలరా? అంటూ ప్రశ్నించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, విజయవాడలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. అంటే తనను అరెస్టు చేయాలని అంటే తన నివాసానికి వచ్చి తీసుకుపోవాలని సిట్ కు హింట్ ఇచ్చారు. జగన్ అలా ఓపెన్ ఆఫర్ ఇచ్చినా సిట్ స్వీకరించడం లేదు. దానికి కారణం జగన్ పాత్రపై మరిన్ని ఆధారాలు సంపాదించాల్సివుందంటున్నారు. అదే సమయంలో జగన్ అరెస్టుకు కేంద్రం నుంచి అనుమతి కూడా ఉండాలని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, మూడు పార్టీలు భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుందని అంటున్నారు. ఏ పార్టీ తన సొంత అజెండా అమలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేసి ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలనేది టీడీపీ ప్లాన్ గా చెబుతున్నారు. దీనికి జనసేన కూడా సహకరించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. కానీ, బీజేపీ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన మద్దతు కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పటికీ ఆ పార్టీ వైసీపీని వదులుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
జగన్ ను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆయనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందేమోనన్న సందేహం ప్రభుత్వ పెద్దల్లో ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం జగన్ ను అరెస్టు చేయాలని కోరుకుంటున్నా, స్కాంలో నిందితుడిగా జైలుకు వెళ్లే జగన్ ఆ తర్వాత ప్రజల నుంచి సానుభూతి పొంది మళ్లీ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందినా దాదాపు 40 శాతం ఓట్లు పొందడాన్ని విస్మరించకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే జగన్ అరెస్టుకు కొంత సమయం వేచిచూడాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.
ఇదే సమయంలో స్కాంలో పలువురు అధికారులు, వైసీపీ నేతలను అరెస్టు చేసి జగన్ ను వదిలేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ ను అరెస్టు చేసే దమ్ములేదని సొంత పార్టీ నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో అన్నివిధాలుగా ఆలోచించి భవిష్యత్తు పరిణామాలపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా ప్రకటనలు జారీ చేస్తున్నారని అన్నారు.
లిక్కర్ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తన వద్ద పనిచేసిన సిఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా మద్యం క్రయ, విక్రయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పుకొస్తున్నారు. అయితే జగన్ వ్యాఖ్యల వెనుక అరెస్టు భయం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలను గమనించిన వారు మాజీ సీఎం జగన్ ను ఇప్పట్లో అరెస్టు చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. మరికొంతకాలం సిట్ దర్యాప్తు జరిపి, జగన్ జోక్యంపై పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.