పాకిస్థాన్ దుర్మార్గాలను ప్రపంచానికి వివరించేందుకు భారత్ లోని అఖిలపక్ష ఎంపీల బృందాలు ప్రయాణమై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాతో పాటు కువైట్, బెహ్రయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం బహ్రెయిన్ కు చేరింది.
ఆ టీమ్ లో ఒకరైన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును… బెహ్రెయిన్ లో మాట్లాడిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇందులో భాగంగా… ఎన్నో సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి తమ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడకు పంపించిందని.. పక్కనున్న ఉగ్రవాద దేశం వల్ల తాము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు.
ఈ సమస్య తమకు పాకిస్థాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని.. పాకిస్థాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయదం ఆపే వరకూ ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు. అలా అని అప్పటివరకూ చూస్తూ ఉండమని.. మరోసారి పాకిస్థాన్ దాడులకు పాల్పడితే ఆ తర్వాత వారు ఆశించిన దానికంటే ఎక్కువగా రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగితే భారత్ సంయమనం పాటించదని పేర్కొన్నారు.
ప్రతీ భారతీయుడి ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని చెప్పిన ఒవైసీ… పహల్గాంలో ఉగ్రవాదులు 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడిని దారుణంగా చంపేసిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం వల్ల జరిగే మానవ నష్టాన్ని నొక్కి చెప్పిన ఆయన.. ఈ ఉగ్రవాదన్ని నిర్మూలించే విషయంలో భారత్ కు సహాయం చేయాలని వారిని కోరారు ఒవైసీ!
ఇదే సమయంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న పాక్ కు నిధులను అరికట్టడంలో అంతర్జాతీయ సహకారం అవసరం అని ఒవైసీ తెలిపారు. ఇందులో భాగంగా… పాకిస్థాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్.ఏ.టీ.ఎఫ్) గ్రే లిస్ట్ లోకి తిరిగి తీసుకురావడానికి బెహ్రెయిన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. దయచేసి పాక్ కు నిధులు మంజూరు చేయొద్దని కోరారు!