తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా?
అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరిచిపోయారని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగానే స్వీకరిస్తానని అన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ డిమాండ్‌లు నెరవేర్చాలని లేకపోతే, జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు మర్చిపోయారా?
”ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా, ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబును కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు. ‘అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు. అగ్ర నటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకుందో అందరూ మర్చిపోయారు. నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా”
ఇక వ్యక్తిగతంగా రావద్దు
”ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు’ అని చెప్పాను. అయినా, ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తా. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తా” అని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్ర పరిశ్రమపై తన అభిప్రాయాన్ని ఘాటుగా ప్రకటన రూపంలో తెలియజేశారు.
రాష్ట్రంలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై పవన్‌కల్యాణ్ ఆరా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల నిర్వహణ, ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో చర్చించారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం. వీటిపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్‌ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారించనున్నారు. సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల, అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పవన్‌కల్యాణ్ యోచిస్తున్నారు