మంచు మనోజ్ తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. సంబంధం లేని విషయాల్లో తన అర్ధాంగిని లాగారని, అప్పుడు తన హృదయం ముక్కలైందన్నారు.
తన తండ్రి మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలని ఉందని ఆకాంక్షించారు. కానీ చేయని తప్పును అంగీకరిస్తే, తన పిల్లలకు తానేమి నేర్పించినట్లు అవుతుందన్నారు. తన తండ్రి మోహన్ బాబు నేర్పించిన నీతి ఇదేనని, అందుకే తాము ముందుకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. తామంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నానని మనోజ్ తెలిపారు.
తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా తమ జీవితాన్ని తాము గడుపుతున్నామని మంచు మనోజ్ తెలిపారు. తన భార్య బొమ్మల కంపెనీ ప్రారంభించిందని, దానికి తాను ఆర్ట్స్ వర్క్ చేయడంతో పాటు కథలు రాశానన్నారు. తాను ఎలాంటి వ్యక్తినో చాలా మందికి తెలుసునన్నారు. ఊహించని విధంగా కష్టాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో తామంతా మళ్లీ కలిశామని, అయితే అది తమ కుటుంబంలోని ఒకరికి నచ్చలేదని అన్నారు. కళాశాలలోని కొన్ని సమస్యల గురించి పెద్దల వరకు వెళ్లడం లేదని విద్యార్థులు లేఖలు రాసి తనకు ఇచ్చారని, దీనిపై మాట్లాడితే నీకేం సంబంధం అనే మాట వచ్చిందన్నారు. అందుకే తాను పోరాడుతూ ఉన్నానని, మీడియా ముందుకు వచ్చానని మంచు మనోజ్ తెలిపారు