Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

కాకినాడ’లో కాకరేపిన ‘జ్యోతుల’ మాటల తూటాలు

మొన్నటికి మొన్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు పేల్చిన ‘ఖర్మ’ బాంబు దుమారం ఇంకా చల్లారనే లేదు. దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాకినాడ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, కూటమి ప్రభుత్వంలో జనసేనకు పెరుగుతున్న ప్రాధాన్యతలూ అక్కడి తెలుగుదేశం సీనియర్లకు గాని, పార్టీ శ్రేణులకు గాని ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఎంతో పట్టున్న కాకినాడ జిల్లాలో జనసేన పట్టు సాధిస్తోందన్న భావన, ఆవేదన వీరిలో రోజురోజుకూ అధికమవుతోంది. దీంతో కొన్నాళ్లుగా ఆ జిల్లాలో టీడీపీ వెర్సస్‌ వైసీపీలా కాకుండా టీడీపీ వెర్సస్‌ జనసేనలా తయారైంది. ఈ నేపథ్యంలో తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మినీ మహానాడు సభ సాక్షిగా చేసిన ఘాటు ప్రసంగం కాకినాడ టీడీపీ, జనసేనల్లో కాకరేపుతోంది. ఈ రెండు మిత్ర పక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరును స్పష్టం చేస్తోంది.

జనసేన దూకుడుకు టీడీపీ చెక్‌ పెట్టడానికేనా?పవ¯Œ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవక ముందు వరకు కాకినాడ జిల్లా అంతటా తెలుగుదేశం పార్టీ ప్రాభవమే నడిచింది. ఎప్పుడైతే పిఠాపురం జనసేన అధినేత వశమైందో అప్పట్నుంచి టీడీపీ, జనసేనల మధ్య తొలుత అంతర్గత, ఆపై బహిర్గత విభేదాలు మొదలయ్యాయి. రోజురోజుకూ ఆ నియోజకవర్గంలో జనసేన పట్టు బిగిస్తుండడం, అక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మను టార్గెట్‌ చేస్తూ రాజకీయాలు చేస్తుండడం వంటి పరిణామాలు టీడీపీ వర్గీయుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. పిఠాపురం పరిణామాలపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఉదాశీనంగా వ్యవహరించడమే కాదు.. పవన్‌పై గాని, నాగబాబుపై గాని, జనసేనకు వ్యతిరేకంగా గళం విప్పొద్దంటూ అంతర్గతంగా ఇచ్చిన ఆదేశాలు టీడీపీ శ్రేణులకు పుండుమీద కారం చల్లేలా చేస్తున్నాయి. దీంతో తమ సీటును జనసేన అధినేతకు త్యాగం చేయబట్టే ఆయన గెలిచారని, లేదంటే ఆ స్థానం తమదేనన్న భావన టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాజీ ఎమ్మల్యే వర్మను టార్గెట్‌ చేస్తూత చే సిన ‘ఖర్మ’ ప్రకటన, ఆ తర్వాత ఎమ్మల్సీగా ఎన్నిక కాగానే పిఠాపురంలో వచ్చి వాలి, టీడీపీ వారితో పనిలేకుండా సుడిగాలి పర్యటనలు చేయడం, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదాలు, తోపులాటలకు దిగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు.. టీడీపీ వర్గీయులపై నాగబాబు పోలీసు కేసులు పెట్టించడం కూడా జరిగింది. ఇవన్నీ టీడీపీ నాయకుల్లో జనసేన పట్ల వ్యతిరేకత పెరగడానికి దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో తమ నిరసనను తెలియజేయడానికి కాకినాడ జిల్లా టీడీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆ జిల్లా టీడీపీలో సీనియర్‌ నేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం మధ్యాహ్నం కాకినాడలో జరిగిన మినీ మహానాడును ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఈ వేదికపై నుంచి ఆయన.. కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లాకు సంబంధించి టీడీపీకంటే జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అధిష్టానం టీడీపీ కార్యకర్తలను విస్మరించడం, గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని వామపక్ష పార్టలు దెబ్బతినడం వంటి అంశాలను నిర్భయంగా కుండబద్దలు కొట్టారు. కార్యకర్తల మనోభావాల పేరిట నేరుగా ఆయన అధినేత చంద్రబాబుకే గట్టి చురకలు అంటించారు. కాకినాడ జిల్లాలో పదవులన్నీ ఆ పార్టీ (జనసేన)కేనా? అంటూ నిప్పులు చెరిగారు. ఇటీవల ఆ జిల్లాలో కీలకమైన కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా), డీసీపీబీ చైర్మన్‌ పదవులు రెండూ జనసేనకు చెందిన తుమ్మల బాబుకే ఇవ్వడంతో పాటు మరికొన్ని పదవుల కేటాయింపులోనూ జనసేనకే ప్రాధాన్యత దక్కడంపై ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతుల వ్యాఖ్యలు ఇటు టీడీపీలోనూ, అటు జనసేనలోనూ త్రీవ కలకలం రేపుతున్నాయి. కాకినాడ జిల్లాలో తమ మనోవేదనకు అద్దం పట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అయితే జ్యోతుల మాటల వల్ల తమకొచ్చే నష్టమేమీ ఉండదని, అన్నిటికీ తమ అధినేత పవన్‌ కల్యాణే చూసుకుంటారని జనసేన నాయకులు కొట్టి పారేస్తున్నారు. ఇంతకీ నెహ్రూ ఏమన్నారంటే?‘ఈ కాకినాడ ఇల్లాలో పంచుకున్న పదవులు ఏ పార్టికి వెళ్లాయో ఆలోచించుకోవాలి. ఆ నిష్పత్తి ప్రకారం టీడీపీ వారికీ ఇవ్వండి. సెకండరీ క్యాడరు లక్షలు ఖర్చు పెట్టుకుని నాశనమయ్యారు. ఇంటికాడ వారి పెళ్లాలు పనీ పాటా లేదా? అని వారిని తిడుతున్నారు. కనీసం పెళ్లానికి సమాధానం చెప్పుకోవడానికైనా తగిలించండయ్యా ఒక తోక.. టీడీపీ, జనసేన, బీజేపీ కాకినాడ జిల్లాలో ఆ నిష్పత్తి ప్రకారమే పదవులు ఇవ్వండి. ఒక వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం న్యాయమా? మెజారిటీ ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ నాయకులకివ్వండి. మీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. రాజకీయాల్లో కూటములుంటాయి. ఎన్నాళ్లుంటాయి? టీడీపీ ఏర్పడ్డ తర్వాత ఎన్నిసార్లు కూటములేర్పడ్డాయి? ఎన్నిసార్లు బయటకు రాలేదు? వచ్చాక పరిస్థితి ఏంటి? అన్నగారున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేశాం తెలివిగా. ఆ తర్వాత ఆ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయాయి. కేవలం మనతో పొత్తు వల్లే తాత్కాలికంగా ఆరోజు వారికి ఒకటో రెండే పదవులొచ్చి ఉండొచ్చు. కానీ శాశ్వతంగా ఆ పార్టీలు న్షష్టపోయాయి. ఆ పరిస్థితి మనకు రాకుండా చూడాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

Related posts

SC quashes AP High Court order, Grants relief to MP Mithun Reddy*

M HANUMATH PRASAD

FALSE LIQUOR SCAM

M HANUMATH PRASAD

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

M HANUMATH PRASAD

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన MIM ఎమ్మెల్యేలు

M HANUMATH PRASAD

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు