తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా కేబినెట్ విస్తరణ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇదే విషయం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ రేసులో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా.. ఆశావాహుల తాకిడి ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని (Congress Madiga community MLAs) మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేల్ (తుంగతుర్తి), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), తోట లక్ష్మీకాంతరావు (జుక్కల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), కాలె యాదయ్య (చేవెళ్ల)లు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఇవాళ సీఎల్పీ హాల్లో ఎమ్మెల్యే మందుల సామేల్ (Mandula Samuel) మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ నికార్సైన మాదిగ కాదని, మాదిగ ఉపకులమని, కడియం శ్రీహరి సైతం మాదిగ ఉప కులమని వివరించారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మాదిగ సామాజిక వర్గ జనాభా రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారని తెలిపారు. మాలలకు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి ఇచ్చారని, మాదిగలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు.
కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మాదిగ సామాజిక వర్గం నేతలు రాజయ్యను గోచీ పీకి పంపించారని, మరో నేత కొప్పుల ఈశ్వర్‌ను అవమానించారని గుర్తుకు చేశారు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ లు సీఎం కి చెప్పాలని కోరారు. మా ఐదుగురిలో ఎవరికి ఇచ్చిన పర్వాలేదు.. అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman Kumar) మాట్లాడుతూ.. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశామని అన్నారు. మాల సామాజికవర్గానికి మేము వ్యతిరేకం కాదని, పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీకి అనుకూలంగా పని చేసిందని చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు పదేళ్లు ఏ శాఖ వదలకుండా దోచుకున్నారని, చివరికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు.