హైదరాబాద్, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ప్రభాకర్‌రావు పోలీసు విచారణకు హాజరుకానందున ఆయన్ను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు అనుమతించింది. అయితే, ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం నెల(జూన్ 20 వరకు) పాటు గడువు ఇచ్చింది. జూన్ 20లోగా ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారి ముందు హాజరు కాని పక్షంలో ఆయన్ను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తారామతిలోని ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. అక్కడి గోడకు నోటీసు అంటించారు.
గడువులోగా ప్రభాకర్ రావు విచారణకు హాజరుకాకపోతే.. ప్రకటిత నేరస్థుడిగా గుర్తించి ప్రభాకర్‌రావుకు చెందిన స్థిర, చర ఆస్తులను దర్యాప్తు అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. కాగా, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడం కోసం దర్యాప్తు అధికారులు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయించారు. ప్రభాకర్‌రావు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని లేకపోతే ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు ద్వారా అమెరికా అధికారులతో మాట్లాడి ఆయన్ను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు పేర్కొంటున్నారు.
