Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రీడా వార్తలు

రోహిత్ కాదు.. ఆ ఇద్దరి వల్లే కెప్టెన్‌గా నా పని ఈజీ అవుతోంది: హార్దిక్ పాండ్యా

ఐపిఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరింది. టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 59 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ విజయంతో రన్‌రేట్‌ను మరింత మెరుగుపరుచుకున్న ముంబై ఇండియన్స్.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లోనూ తడబడిన ముంబై ఇండియన్స్.. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్), నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌కు తోడుగా.. మిచెల్ సాంట్నర్(3/11), జస్‌ప్రీత్ బుమ్రా(3/12) నిప్పులు చెరగడంతో సునాయస విజయాన్నందుకుంది. తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. నమన్ ధీర్ అద్భుత బ్యాటింగ్‌ తమ విజయానికి కలిసొచ్చిందని చెప్పాడు.

‘ప్లే ఆఫ్స్ చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. బుమ్రా, సాంట్నర్ ఉండటం నాకు ఒక విలాసమని చెప్పొచ్చు. నాకు కావాల్సినప్పుడల్లా వారికి బంతిని ఇవ్వగలను. వారు అద్భుతమైన బౌలింగ్‌తో ఆశించిన ఫలితాన్ని అందిస్తారు. వారి బౌలింగ్‌తో నా పని మరింత సులువవుతోంది. ఈ వికెట్‌పై 180 పరుగులు చేస్తే చాలానుకున్నాం. కానీ వికెట్లు కోల్పోవడంతో 160 పరుగులు చేస్తే చాలు అనుకున్నాం. కానీ నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మేం ఆశించిన లక్ష్యాన్ని అందించారు. ముఖ్యంగా నమన్ ధీర్ ఇలాంటి కఠినమైన పిచ్‌పై వచ్చి విలువైన పరుగులు చేయడం అద్భుతం.’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం విశేషం. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Related posts

ఇదికదా మ్యాచ్ అంటే.. నరాలు తెగే ఉత్కంఠ

SIVANANDA BHAGAVATI

రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం.. ఏం జరిగింది?

M HANUMATH PRASAD

గిట్ల ఆడినవ్ ఏంది కాకా..!!

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు మరో ఎదురుదెబ్బ

వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ఘోర అవమానం.. క్రికెట్‌లో ఒకే రోజు రెండు మిరాకిల్స్

ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలివే!