కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై (Karnataka BJP MLA Munirathna) ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్‌ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
దీంతో బీజేపీ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 40 ఏళ్ల బీజేపీ మహిళా కార్యకర్త బుధవారం బెంగళూరు యశ్వంత్‌పూర్ సమీపంలోని ఆర్‌ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2023 జూన్ 11న మత్తికెరెలోని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కార్యాలయంలో తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఎమ్మెల్యే ఆదేశాలతో తనపై తప్పుగా మోపిన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు సహాయం చేస్తామని నమ్మించిన ఎమ్మెల్యే అనుచరులు తనను అక్కడకు తీసుకెళ్లారని ఆమె తెలిపింది.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆఫీసులోకి ప్రవేశించిన తర్వాత మునిరత్న, ఇద్దరు అనుచరులు తన బట్టలు విప్పారని, తన కొడుకును చంపేస్తామని బెదిరించారని, తనపై అత్యాచారం చేయమని ఇద్దరిని ఆదేశించాడని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని తెలిపింది. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఆ గదిలోకి వచ్చి మునిరత్నకు ఒక తెల్లటి పెట్టె ఇచ్చాడని, దాని నుంచి సిరంజి తీసి తనకు ఇంజెక్ట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు ఈ ఏడాది జనవరిలో తాను ఆసుపత్రి పాలయ్యానని ఆ మహిళ తెలిపింది. లైంగిక దాడి సమయంలో చేసిన ఇంజెక్షన్ వల్ల నయం కాని వైరస్ తన శరీరంలో ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పింది. మే 19న మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించానని, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది.
కాగా, బీజేపీ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఎమ్మెల్యే మునిరత్న తనపై ద్వేషం పెంచుకున్నాడని ఆ మహిళ ఆరోపించింది. పీన్యా, ఆర్‌ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్లలో తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న, అతడి అనుచరులపై సామూహిక లైంగికదాడితోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.