న్యాయవాదుల గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు
లాయర్లు సెలవు దినాల్లో పని చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్న అంశంపైన సీజేఐ మాట్లాడారు. వేసవి సెలవుల తర్వాత తన కేసును విచారించాలని ఓ న్యాయవాది కోరారు. దీనిపైనే సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ”న్యాయమూర్తులు సెలవుల్లో పనిచేస్తున్నారు. అయినా సరే పెండింగ్ కేసుల విషయంలో మమ్మల్ని నిందిస్తున్నారు. కానీ, సెలవుల్లో పనిచేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులే” అని సీజేఐ పేర్కొన్నారు.
వేసవి సెలవులపై సుప్రీంకోర్టు..
వేసవి సెలవుల్లో పనిచేసే ధర్మాసనాలకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు (supreme court) నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీనిని “పాక్షిక కోర్టు పని దినాలు”గా మార్చారు. మే 26 నుండి జూలై 13 వరకు రాబోయే వేసవి సెలవుల్లో రెండు నుంచి ఐదు ధర్మాసనాలు పనిచేయనున్నాయి. మే 26 నుండి జూన్ 1 వరకు ప్రధాన న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్ జేకే మహేశ్వరి, బీవీ నాగరత్న వరుసగా ఐదు బెంచీలకు నాయకత్వం వహిస్తారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచే ఉంటుంది. మరోవైపు, భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గతవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 మే 24న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆరేళ్లలో సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. 370 అధికరణం రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు, పెద్దనోట్ల రద్దు, ఎస్సీల వర్గీకరణ వంటి అనేక సంచలనాత్మక కేసులలో తీర్పులు వెలువరించారు. సీజేఐగా ఆయన ఈ ఏడాది నవంబరు 23 వరకు కొనసాగుతారు.