దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు.
జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట ఆత్మాహుతి దాడులకు వీరిద్దరు ప్లాన్ చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ స్టేషన్‌లో ఏఎస్సైగా, తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
సిరాజ్ 2017లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఒక కం పెనీలో నాలుగు నెలలు పనిచేశాడు. ఆ తర్వా త హైదరాబాద్‌లో ఎస్సై సెలక్షన్స్ శిక్షణ కోసం వచ్చి.. 2018, 2022లో రెండుసార్లు విఫలమయ్యాడు. గ్రూపు-1 కోసం శిక్షణ తీసుకుని 2019, 2024లో రెండుసార్లు ప్రయత్నం చేసినా సెలెక్ట్ కాలేదు. దీంతో 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ‘108’లో టెలికాలర్ గా పనిచేశాడు. హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పరహాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్‌తో పరిచయాలు పెరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.
సిగ్నల్ యాప్ నుంచే చర్చలు, చాటింగ్‌లు..
వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సిగ్నల్ గ్రూపులలో ‘ఖిలావత్, జిహాదీ’ అంశాలపై చర్చించుకునేవారని పోలీసులు తేల్చారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చించుకునేవారు. డాక్టర్ ఇష్రార్ అహ్మద్, జకీర్ నాయక్, షేక్ యాకూబ్ జమాలీ, షేక్ జావెద్ రబ్బానీ ప్రసంగాలతో వీరు ప్రేరణ పొందినట్టు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ముస్లిమేతరుల చేతిలో ముస్లిం మహిళలు మోసపోకుండా రక్షించేలా ఏహెచ్‌ఐఎం (అల్-హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 22న ముంబై వెళ్లి ఓ పదిమందిని కలిశారని, అద్నాన్ ఖురేషీ, దిల్షాన్, మొహిసిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్‌తో కలిసి ఓ లైవ్ షోకు వీరు హాజరయ్యారని పోలీసులు తెలిపారు.
ఓన్లీ ‘సిగ్నల్’ కాల్స్..
వీరంతా బీహార్‌కు చెందిన అబూతలయం అలియాస్ అబూ ముసబ్ సూచనల మేరకు సిగ్నల్ యాప్‌లో తరచూ మాట్లాడుకునే వారని పోలీసులు తెలిపారు. జిహాదీ వైపు ఆకర్షితులైన వీరంతా తక్కువ ఖర్చుతో పేలుడు పదార్థాలు తయారు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. యువతను మతోన్మాదం వైపు మరల్చడానికి అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఎన్‌ఐఏకు ఉగ్ర కుట్ర కేసు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీగా ఆత్మాహుతి దాడులకు కుట్ర చేసిన సిరాజ్, సమీర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకోనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో వారిని విచారించేందుకు ఎన్‌ఐఏ ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. కేసు తీవ్రత దృష్ట్యా విజయనగరం పోలీసులు సైతం ఎన్‌ఐఏకు కేసును అప్పగించేందుకు అంగీకరించిందని సమాచారం. ఇప్పటికే విశాఖ కేంద్ర కారాగారంలో వీరిద్దరినీ పలు కోణాల్లో ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా వీరు పేలుళ్లకు కుట్ర చేశారా? ఎవరెవరిని కలిశారు? వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? వారికి నిధులు సమకూర్చింది ఎవరు? ఆయా బ్యాంకు ఖాతాల వివరాలు వంటి అంశాలపై దృష్టి సారించారు. మొదటిరోజు పూర్తి సమాచారాన్ని సేకరించిన ఎన్‌ఐఏ.. రిమాండ్‌లో ఉన్నవారిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి చేసినట్టు సమాచారం.