ఉ గ్రవాదులు మరోసారి అమాయక ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి (Terror Attack School Bus) చేశారు.
ఈ ఘటనలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడును అక్కడి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. మరోవైపు అధికారులు ఈ దాడి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
తీవ్రంగా ఖండించిన హోంమంత్రి
సమాచారం ప్రకారం, స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన వెంటనే సహాయ, రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను క్వెట్టా, కరాచీలోని పెద్ద ఆసుపత్రులకు తరలించారు. పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. దేశంలో భయాన్ని, అస్థిరతను వ్యాప్తి చేయడమే వారి దాడి ఉద్దేశమని, అయితే ప్రభుత్వం, భద్రతా దళాలు వీటిని విజయవంతం చేయనివ్వవని వెల్లడించారు.
కొనసాగుతున్న వేర్పాటువాద కార్యకలాపాలు
బలూచిస్తాన్ చాలా కాలంగా పాకిస్థాన్‌కు అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. ఇక్కడి వేర్పాటువాద శక్తులు పాకిస్ణాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో అనేకసార్లు పాకిస్థాన్ సైన్యాన్ని, పలువురని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద ఘటనల సంఖ్య భారీగా పెరగడం విశేషం. ఈ క్రమంలోనే బలూచిస్తాన్‌లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడి పాకిస్థాన్ అంతర్గత భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.
ఇది వరకు కూడా..
భారత ఉపఖండానికి పశ్చిమదిక్కుగా ఉండే బలోచిస్తాన్ ప్రాంతం… ప్రకృతి సౌందర్యం, ఖనిజ సంపదలతో ఉంది. ఈ నేలపై ఇప్పుడు పేలుళ్ల స్వరం వినిపిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంతం బలోచ్ విడిపోయిన తత్వవాదుల కదలికలతో దద్దరిల్లిపోతోంది. ముఖ్యంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేరుతో విప్లవకారులు పదే పదే పేలుళ్లు, కాల్పుల ద్వారా ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కిల్లా అబ్దుల్లా నగరంలోని మార్కెట్ వద్ద కార్ బాంబ్ పేలుడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక్కటే కాదు, మార్చిలో జరిగిన ఘోర ఘటనలో, ఓ రైలు పై దాడి చేసి 33 మందిని, ప్రధానంగా సైనికులను BLA హతమార్చింది.
