పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కీలక వ్యాఖ్యలు చేశారు.
కల్లోలిత బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ క్రమంలోనే బలోచిస్థాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు హిమంత తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.
”బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతోంది. దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ దోపిడీ ఎక్కువైంది. పాకిస్థాన్‌లోని మొత్తం ఖనిజ సంపదలో 80 శాతానికిపైగా బలోచిస్థాన్‌లోనే ఉండగా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అక్కడ భారీగా రాగి- బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించని సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజం, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం, 35 మిలియన్ టన్నుల రాగి కూడా ఉంది” అని హిమంత తెలిపారు.
ఇదిలా ఉంటే.. బలోచిస్థాన్‌లో సుయ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు 1952లో కనుగొనగా.. 2020 నాటికి పాకిస్థాన్‌కు సుమారుగా 56శాతం సహజ వాయువును అందిస్తోందని హిమంత బిశ్వశర్మ చెప్పుకొచ్చారు. బలోచిస్థాన్‌లోని గ్వదర్ ఓడరేవు 770 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. ప్రభుత్వ రంగ ఉపాధిలో బలోచిస్థాన్ ప్రావిన్స్ వాటా కూడా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు సమృద్ధిగా వనరులు ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని వివరించారు. బలోచిస్థాన్‌లో వనరుల కొరత లేదు కానీ.. పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ దోపిడీ అధికంగా ఉందని హిమంత ఆరోపించారు. కాగా.. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పాక్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
