పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) పాకిస్తాన్‌లో పర్యటించారని, ఐఎస్ఐతో సన్నిహితంగా వ్యవహరించారని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ (Himanta Biswa Sharma) చేసిన సంచలన ఆరోపణలు వ్యవహారం మరింత ముదురుతోంది.
తాజాగా తన వాదనను హిమంత్ బిస్వ శర్మ మరింత బలంగా వినిపించారు. తాను చెప్పింది తప్పని తేలితే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నేను చెప్పిన విషయాల్లో ఒక్కటి తప్పయినా సీఎం పదవిని వదులుకుంటాను. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చేసిన దానితో పోల్చుకుంటే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నేరం లెక్కలోకి కాదు. గొగోయ్ చేసిన నేరం గూఢచర్యం కాకుంటే ఏమవుతుంది?” అని హిమంత్ బిస్వ శర్మ ప్రశ్నించారు.
సమాచారం బయటపెడతాం
కాగా గొగోయ్ వ్యవహారంపై సాక్ష్యాలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని క్రోడీకరిస్తున్నామని, త్వరలోనే వీటిని బహిరంగ పరుస్తామని అసోం సీఎం చెప్పారు. ”గొగోయ్ వ్యవహారం చిన్నదేమీ కాదు. ఇందుకు అవసరమైన విశ్వసనీయ సమాచారం, ఆధారాలు మా వద్ద ఉన్నాయి” అని తెలిపారు. కోర్ట్ అడ్మిషబుల్ ప్రూఫ్ కోసం సిట్ పనిచేస్తోందని, దీనిపై చురుగ్గా విచారణ జరుగుతోందని, మరిన్ని వివరాలు సెప్టెంబర్ 10న మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. అవసరమైన వివరాలను ఎంబసీలు అందిస్తున్నాయని, ఆ పక్రియ పూర్తికాగానే తిరుగులేని సాక్ష్యాలతో తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. కాగా, హిమంత్ బిస్వ శర్మ ఆరోపణలను గౌరవ్ గొగోయ్ ఇప్పటికే తోసిపుచ్చారు. సీఎం ఆరోగ్యం బాగున్నట్టు లేదని, గత 13 ఏళ్లుగా తనపై ఆయన తనపై నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే ఎప్పుడో సెప్టెంబర్ వరకూ కాకుండా వెంటనే వాటిని బహిరంగ పరచాలని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
