న్యాయ వ్యవస్ధలో అత్యున్నత పదవి అయిన భారత ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ఉన్న రెండో దళిత జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్ కు ఇవాళ అవమానం జరిగింది. మహారాష్ట్రలో ఆయన హాజరైన ఓ కార్యక్రమానికి రాష్ట్ర సీఎస్, డీజీపీ, ముంబై పోలీసు కమిషనర్ ఎవరూ హాజరు కాలేదు.
దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. స్వరాష్ట్రం మహారాష్ట్రకు తొలిసారి ఛీఫ్ జస్టిస్ హోదాలో అడుగుపెడితే ఇలా వ్యవహరిస్తారా అంటూ బీఆర్ గవాయ్ ఫైర్ అయ్యారు.
సీజేఐ అయిన సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి గవాయ్ హాజరయ్యారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక చైత్య భూమిని సందర్శించారు. మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగించిన ఛీఫ్ జస్టిస్.. ముగ్గురు కీలక అధికారులు మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముంబై పోలీస్ కమిషనర్ అక్కడికి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 142 గురించి చర్చలు మొదలుపెడతారని, కానీ మూడు రాజ్యాంగ వ్యవస్థలూ పరస్పరం గౌరవం ఇచ్చుకోవాలని, సహకరించుకోవాలని సీజే గవాయ్ సూచించారు. ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాలైన న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ సమానమని ఆయన తెలిపారు. ప్రతి రాజ్యాంగ సంస్థ ఇతర సంస్థలకు ప్రతిస్పందించాలని, గౌరవం చూపాలని ఆయన తెలిపారు.
మహారాష్ట్ర నుండి ఒక వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు, మొదటిసారి స్వరాష్ట్రాన్ని సందర్శించినప్పుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేదా ముంబై పోలీస్ కమిషనర్ హాజరు కావడం సముచితం కాదని భావిస్తే, వారు దాని గురించి ఆలోచించాలని సూచించారు. ప్రోటోకాల్‌లు కొత్తవి కావని, ఇది ఒక రాజ్యాంగ సంస్థ మరొక సంస్థకు ఇచ్చే గౌరవానికి సంబంధించిన ప్రశ్న అన్నారు. ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చని, కానీ ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సీజే వ్యాఖ్యల తర్వాత సీఎస్, డీజీపీ, ముంబై కమిషనర్ అక్కడికి హుటాహుటిన వచ్చారు.