ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో పాక్ (Pakistan) సైతం ఇదే రకమైన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ తమపై చేసిన దాడుల గురించి విదేశాలకు వివరించడానికి మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bhutto-Zardari) నేతృత్వంలో ఓ బృందాన్ని పలు దేశాలకు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపాయి.
ఈ విషయంపై ఆ దేశ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అమెరికా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు తమ వైఖరిని తెలియజేయడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతినిధి బృందంలో మాజీ డిప్యూటీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్, మాజీ విదేశాంగ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. తమ బృందానికి నాయకత్వం వహించాలని తనను కోరినట్లు భుట్టో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కాగా సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడానికి ఏడు బృందాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నట్లు భారత ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (భాజపా), బైజయంత్ పాండా (భాజపా), సంజయ్‌కుమార్ ఝా (జేడీ-యూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలె (ఎన్సీపీ-ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) ఈ బృందాలకు నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.