పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి మద్దతుగా నిలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పాకిస్తాన్ లో ట్రోలింగ్స్ పెరిగాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ కు దిగుతున్న పాకిస్తాన్ ను ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో భాగంగా ఉన్న ఓవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా నిలిచిన తనపై పాకిస్తాన్ పౌరులు చేస్తున్న ట్రోలింగ్స్ పై అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ స్పందించారు. తాను పాకిస్తాన్ దుల్హే భాయ్ ని(బావని) అని తాను సరదాగా వ్యాఖ్యానించారు. తాను మాత్రమే వారికి బావని అన్నారు. వాళ్లకు తనంత అందగా ఉన్న వ్యక్తి దొరకడన్నారు. వాళ్ళకు భారత్ లో మాత్రమే తన లాంటి వ్యక్తులు కనిపిస్తారన్నారు. అలాగే తనను చూస్తూ ఉండాలని, తన మాట వింటూ ఉండాలని పాకిస్తాన్ ట్రోలర్లకు ఓవైసీ సెటైర్లు వేశారు. అది మీ జ్ఞానాన్ని పెంచుతుందన్నారు. మీ మెదడులోని గడ్డి తొలగిపోతుందని, మీ అజ్ఞానం అంతమవుతుందని హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ నాయకుల అణ్వాయుధ బెదిరింపులపై ఓవైసీ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎప్పుడూ అణ్వాయుధ శక్తి గురించి మాట్లాడుతుందని, వారు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజలను చంపితే, ఆ దేశం మౌనంగా ఉండదని వారు గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఏదైనా సరే, మన భూమిపై మన ప్రజలను చంపి, మతం ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుంటే చూస్తూ ఊరుకోదన్నారు. మీరు ఐసిస్లాగా వ్యవహరించారని పాకిస్తాన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.
పహల్గాం దాడి తర్వాత కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి కనీసం ఐదుగురు ఎంపీలున్న పార్టీల్ని మాత్రమే ఆహ్వానించింది. దీంతో ఓవైసీకి అవకాశం దక్కలేదు. అయితే ఓవైసీ దీనిపై పోరాడి మరీ అఖిలపక్ష భేటీకి వెళ్లి కేంద్రానికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత కూడా పహల్గాం దాడికి వ్యతిరేకంగా దేశంలో ముస్లింలు నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాదు పాకిస్తాన్ నేతల విమర్శలకు ఎప్పటికప్పుడు ఘాటు కౌంటర్లు ఇచ్చారు. దీంతో ఇప్పుడు కేంద్రం ఆయన్ని ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ పై వివరణ ఇచ్చేందుకు పంపుతున్న అఖిలపక్ష ఎంపీల్లోనూ చోటు కల్పించింది.
