సిద్దిపేట: ఆయన దేశం కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్న సైనికుడు. తన కుటుంబాన్ని, తన ప్రాణాలను లెక్కచేయకుండా దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో భారత జవాన్ భూమి కబ్జా చేసిన ఘటన సంచలనంగా మారింది.
వీఆర్వో సోదరుడు తన భూమిని కబ్జా చేశారంటూ భారత జవాను ఆరోపించిన వీడియో వైరల్ అవుతోంది. తాను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని జవాన్ చెప్పిన మాటలు అందర్నీ కదిలిస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జవాను
సిద్దిపేట జిల్లా అక్బర్పేట- భూంపల్లి మండలం చౌదర్పల్లెకి చెందిన రామస్వామి భారతదేశ ప్రజల రక్షణ కోసం జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలు అందిస్తున్నారు. స్వగ్రామంలో తన భూమిని వీఆర్వో సోదరుడు కబ్జా చేశాడని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కనిపించలేదు. తనకు న్యాయం చేయాలని గతంలో పలుమార్లు ఆర్డీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జవాను రామస్వామి ఆరోపించారు. తన భూమిని తిరిగి దక్కించుకునేందుకు తాను పోరాటం చేస్తున్నానని, తన తల్లిదండ్రులను కొందరు బెదిరిస్తున్నారని వీడియో ద్వారా తెలిపారు.
మాకు న్యాయం చేయండి
తన భూమి తనకు దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి వేడుకున్నారు. తన కుటుంబాన్ని సైతం కబ్జాదారుల నుంచి రక్షంచాలంటూ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. కబ్జా చేసింది వీఆర్వో సోదరుడు కావడంతో రికార్డులలో తమ పేర్లను పూర్తిగా తొలగించి, కబ్జాదారుల పేర్లను చేర్చారని బాధిత జవాను ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం వెళ్లేలా చూసి, తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరారు.
పహల్గాంలో ఉగ్రదాడి తరువాత సైన్యం చేసే త్యాగాలు, సేవల్ని దేశ ప్రజలు మరింతగా గుర్తిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో సైనికులకు అన్యాయం జరుగుతోంది. వారు ఎలాగూ సరిహద్దుల్లో ఉంటారు, ఇక్కడ తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహిస్తున్నారు. జవానుకు చెందిన స్థలాలు కబ్జా చేస్తున్న ఘటనలపై ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.
