ఆపరేషన్ సిందూర్ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో పాకిస్థాన్‌లో నిలిచిపోయిన 150 అఫ్గాన్ సరకు రవాణా ట్రక్కులను వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్ వచ్చేందుకు అనుమతించారు.
వీటిలో అధిక శాతం డ్రై ఫ్రూట్స్ తీసుకువచ్చేవే. ఇప్పటికే 8 ట్రక్కులు భారత్ చేరుకున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లాక తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో గురువారం ఫోన్‌లో సంభాషించారు. ఈమేరకు జైశంకర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేగాక తప్పుడు, నిరాధార వార్తలతో భారత్, అఫ్గానిస్థాన్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాలను తిప్పికొట్టడాన్ని స్వాగతించారు. సుదీర్ఘ కాలంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తుచేసినట్లు జైశంకర్ పేర్కొన్నారు.
