బ లూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా 56 మంది పాక్ సైనికులను హతమార్చామని బీఎల్ఏ వెల్లడించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై తుపాకులతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.పాక్లో 44శాతం ఉన్న తమ భూ భాగాన్ని 1948 మార్చి 27న పాక్ బలవంతంగా కలుపుకుందనే కారణంతో బలూచ్ పోరాటం చేస్తూనే ఉంది.
ఇదిలాఉండగా బలూచిస్తాన్ నాయకుడు ఇప్పటికే తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ ఈ ప్రకటనతోనే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందదు. పాక్ నుంచి విడిపోవడం బలుచిస్తాన్ కు అంత సులభం కాదు. ఒక ప్రాంతం దేశంగా గుర్తింపు పొందే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కొత్త దేశంగా గుర్తింపు పొందాలంటే శక్తివంతమైన దేశాల మద్దతు అవసరం. బలూచిస్తాన్ స్వాతంత్రానికి ఐక్యరాజ్యసమితి సహాయం, ప్రపంచంలోని ప్రధాన శక్తుల మద్దతు తప్పనిసరి. మొదటగా బలూచిస్తాన్ను విడిచిపెట్టడానికి పాకిస్తాన్ అంగీకరించాలి. రెండవది బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారడానికి అగ్రరాజ్యాల మద్దతు లభించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అవకాశం కనిపించట్లేదు.
ప్రత్యేక దేశం కోసం ముందుగా ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్కు ఒక దరఖాస్తు పంపించాలి. అందులో ఆ ప్రాంతం ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి చార్టర్ను అంటే రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేయాలి. ఐక్యరాజ్యసమితి దరఖాస్తును స్వీకరించిన తర్వాత దానిని భద్రతా మండలికి పంపుతారు. భద్రతా మండలిలోని 15 మంది సభ్యులలో కనీసం 9 మంది ఈ ప్రాంతం ఒక దేశంగా మారాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలి. కౌన్సిల్లోని 15సభ్య దేశాలలో 5గురు శాశ్వత సభ్యులు.. చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా ఆ ప్రాంతం దేశంగా మారడానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఒకవేళ దరఖాస్తు ఆమోదించబడితే ఐక్యరాజ్యసమితిలో దేశం చేరడానికి కౌన్సిల్ సిఫార్సును జనరల్ అసెంబ్లీకి తీసుకువెళతారు. జనరల్ అసెంబ్లీలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త దేశం ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు పొందాలంటే జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం పాక్ తీవ్ర సంక్షోభంతో పాటు భారత్ తో వార్ నేపథ్యంలో బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితిలో మద్దతు లభించే అవకాశం లేదు.
