తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన నటుడు విజయ్, తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, పార్టీ విస్తరణపై పూర్తి దృష్టి సారించి, ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
పార్టీ పేరు, జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ, బూత్ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు.త్వరలో ప్రజా పర్యటనకు సిద్ధమవుతున్న విజయ్, అంతకుముందు పార్టీ పరిస్థితి, ప్రజల్లో స్పందన తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే నిర్వహించారు. దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన ఈ సర్వే ఫలితాలు TVK పార్టీకి అనుకూలంగా వచ్చాయని సమాచారం.
ఈ సర్వే ప్రకారం, 2026 ఎన్నికల్లో TVK పార్టీ 34.55 శాతం ఓట్లతో 95-105 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అధికార డీఎంకే కూటమి 30.20 శాతం ఓట్లతో 75-85 స్థానాల్లో, అన్నాడీఎంకే 2.85 శాతం ఓట్లతో 55-65 స్థానాల్లో గెలుపొందొచ్చని అంచనా వేస్తున్నారు.
సర్వే ఫలితాలు ఉత్సాహాన్ని నింపడంతో, TVK పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. ప్రైవేట్ హోర్డింగ్‌లు, వాల్స్‌ను ముందే బుక్ చేసుకుంటూ, వినూత్న కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి.
