బస్సు కండక్టర్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్లో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం దొనబైలుకు చెందిన హరినాథ్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా మధుసూదన అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కండక్టర్గా పని చేస్తున్నాడు. అయితే ఆయన బస్సు బెంగళూరు నుంచి బయలుదేరి మదనపల్లెకు వచ్చే క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషాకు చెందిన బస్సును తరచూ మధ్యలో ఓవర్టేక్ చేసుకుని వస్తోంది. గతంలో ఇలాగే ఈ రెండు బస్సుల సమయాలపై ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి.
అనుచరులతో కలిసి కండక్టర్పై దాడి
2025 మే 15వ తేదీ గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మధుసూదన బస్సు మదనపల్లెలోని బెంగళూరు బస్టాండుకు చేరుకోగా అందులో ప్రయాణికులు ఎక్కుతున్నారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషా.. తనకు సంబంధించిన 20 మందికి పైగా అనుచరులతో కలిసి కండక్టర్పై దాడికి దిగాడు. తన బస్సుకంటే ముందుగా ఎందుకు వస్తున్నారంటూ.. కొట్టారని బాధితుడు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవాజ్బాషాతో మాట్లాడారు. బాధితుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని ఫిర్యాదు మేరకు నవాజ్బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర వెల్లడించారు.