ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నేతృత్వంలో దేశం సేఫ్‌గా లేదని సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D.Raja) విమర్శించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మోడీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పర్యాటకుల మృతిపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పెహల్గాం(Pahalgam) ఘటనపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించి..
సుదీర్ఘంగా చర్చించాలని డిమాండ్ చేశారు. చర్చ జరిగితే సభా వేదికగా మోడీని నిలదీస్తామని అన్నారు. భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాలు అవసరం లేదని తెలిపారు. అసలు ఇండియా మీద ట్రంప్ పెత్తనం ఏంటని సీరియస్ అయ్యారు.
కాగా, భారత్- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ ఘనతేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే అమెరికా నేత, పెంటగాన్ (Pentagon) మాజీ అధికారి మైఖేల్ రూబిన్ (Michael Rubin) స్పందించి ట్రంప్‌పై విమర్శలు చేశారు. అమెరికన్లలాగే భారతీయులు కూడా ట్రంప్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంటర్నెట్ కనిపెట్టడం నుంచి క్యాన్సర్‌ను నయం చేసేవరకు అన్నింటికీ క్రెడిట్ తీసుకోవడం ట్రంప్‌నకు అలవాటేనని రూబిన్ ఎద్దేవా చేశారు.