ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ (Covid -19) మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది
ఈ వైరస్ తో పాటు.. అడినో వైరస్, రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుండటంతో రెండు దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాంకాంగ్ 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. ఈనెల 3వ తేదీన తొలికేసు నిర్థారణ అవ్వగా.. కేవలం వారంరోజుల్లోనే వేలల్లో కేసులు నమోదవ్వడం భయపెడుతోంది. సింగపూర్ లో వారంరోజుల్లోనే 14,200కు కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ రెండుదేశాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్, అడినో వైరస్, రైనో వైరస్ లు వ్యాప్తి చెందుతుండటంతో.. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ (WHO) ఆరా తీస్తోంది.
ఈ రెండు దేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. హాంకాంగ్ లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు.. లోకల్ మీడియాతో అన్నారు. ముఖ్యంగా హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హాంకాంగ్ సింగర్ ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడటంతో.. తైవాన్లోని కావోసియుంగ్ లో ప్రోగ్రామ్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు చైనీస్ సోషల్ మీడియా తెలిపింది.
