మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు స్థలాన్ని ఆక్రమించి, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదికలో అధికారులు తెలిపారు.
ప్రభుత్వ అటవీ భూమిలో 27.98 ఎకరాలను పెద్ది రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసినట్లు తేలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బోరు వేయడంతో పాటు రూ.కోటికి పైగా జీవవైవిధ్యానికి నష్టం కలిగించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పెద్దరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. విద్యార్థి నేతగా కాలేజీ రోజుల నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ తర్వాత 2013లో వైఎస్సార్సీపీ పార్టీలో చేరి కీలక నేతగా ఉన్నారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి సోషియాలజీ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన పెద్ది రెడ్డి వ్యాపారంలో కూడా రాణించాడు.
1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తనదైన ముద్ర వేసుకున్నాడు. 1999, 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మేల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎమ్యెల్యేగా గెలిచారు. జగన్ మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.
