నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకూ రానివ్వడం లేదు.
భారత్‌కు తీసుకువెళ్లు నాన్న’
ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్‌లో తండ్రికి చెప్పుకొన్న వేదన.
బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్‌బాషా డిసెంబరులో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ యజమాని వద్ద పనిలో చేరారు. అనుకున్న పని కాకుండా వేరే దానికి అప్పగించడంతో సరిగా చేయలేకపోయారు. ఒక రోజు చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టమని చెప్పారు. చేతకాకున్నా.. చెట్టుపైకి ఎక్కడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల వద్ద చికిత్స తీసుకుని.. కొద్దిరోజులు తెలిసిన వారి దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. యజమాని దళారికి ఫోన్ చేసి.. ఒప్పంద సమయం ఇంకా ఉందని, నజీర్‌బాషాను పంపించాలని కోరారు. దాంతో మళ్లీ అక్కడికే పనికి వెళ్లాడు. మూడు నెలలు పనిచేయించుకుని జీతం అడిగితే చిత్రహింసలు పెడుతూ.. చెట్టుకు కట్టేసి చితక బాదారంటూ తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేశారు. తన వద్ద ఉన్న చరవాణిని సైతం లాక్కున్నారని తెలిపారు. అదే సమయంలో పొరుగువారు నజీర్‌బాషా పడుతున్న నరకయాతనను వీడియో తీసి.. తల్లిదండ్రులకు పంపించారు. ప్రభుత్వం స్పందించి.. తమ బిడ్డను స్వదేశానికి తీసుకురావాలని బాధిత తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. దాదాపు రూ. 2 లక్షలు అప్పు చేసి అక్కడికి పంపించామని.. స్వదేశానికి రావాలంటే రూ. లక్ష చెల్లించాలని కుమారుడు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు
