విదేశాలకు వెళ్లాలని కోరిక ఉంది. కానీ విద్యార్హత లేదు. ఆ విద్యార్హతను సాధించేందుకు చదువుకోవాల్సి ఉండగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి డబ్బులతో సర్టిఫికేట్ ను పొందేందుకు జిమ్ ల చుట్టూ తిరిగారు.
ఇలా ఇద్దరు జిమ్ ట్రైనర్ లు పరిచయమై నకిలీ సర్టిఫికెట్ లను ఇప్పించారు. ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పాటు ఇద్దరు జిమ్ ట్రైనర్ లు, ఓ ఎడ్యూకేషనల్ కన్సెల్టెన్సీ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పూల్ బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ ఎడ్యూకేషనల్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తున్నాడు.
అతని స్నేహితులు మహ్మద్ అల్ బషీర్ రహ్మాని, జియా ఉర్ రహ్మాన్ లు జిమ్ ట్రైనర్ లుగా పని చేస్తున్నారు. టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన మహ్మద్ నసీర్ ఖాన్ ఇంటర్మీడియట్ చదివి పూర్తి చేసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోవడంతో నసీర్ ఖాన్ కి విదేశాలకు వెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఉన్నత చదువులు చదివి పాస్ కావడానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉండడంతో నకిలీ సర్టిఫికెట్ ను తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీని కోసం నకిలీ సర్టిఫికెట్ కావాలంటూ జిమ్ ట్రైనర్ లను సంప్రదించాడు. నసీర్ ఖాన్ కు డిగ్రీ సర్టిఫికెట్ ను ఇవ్వడానికి వారు ఓకే చెప్పారు.ఈ ఇద్దరు కలిసి ముజీబ్ హుస్సేన్ ద్వారా సర్టిఫికెట్ ను ఇచ్చారు. దీని కోసం నసీర్ ఖాన్ నుంచి జిమ్ ట్రైనర్ లు రూ.80 వేల ను తీసుకున్నారు.
ఈ 80 వేలలో జిమ్ ట్రైనర్ లు రూ.20 వేలు కమిషన్ గా తీసుకుని రూ. 60 వేల ను తీసుకుని ముజీబ్ ఇచ్చారని, అతను 10 వేలు కమిషన్ ను తీసుకుని రూ. 50 వేలను కోల్ కత్తా కి చెందిన మనోజ్ విశ్వాస్, యూపీ మీరట్ కు చెందిన రవీందర్, అజయ్ లకు ఆన్లైన్ లో పంపించారు. ఆ తర్వాత నసీర్ ఖాన్ డిగ్రీ సర్టిఫికెట్ ను కొరియర్ లో పంపించారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ముజీబ్ ఆధార్ కార్డును వాట్సాప్ లో కోల్ కత్తా, యూపీ చెందిన వారికి పంపిస్తే వారు సర్టిఫికెట్ ను వారం రోజుల్లో తయారు చేసేస్తారని తెలిసింది. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం 108 సర్టిఫికెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 20 మందికి సంబంధించిన ఈ సర్టిఫికెట్ లలో డిగ్రీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లు ఉన్నాయని పోలీసులు వివరించారు. త్వరలో ఈ 20 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
డిగ్రికి 3 సంవత్సరాల సర్టిఫికేట్ లు, ఇంజినీరింగ్ అయితే నాలుగు సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికేట్ లను ఈ ముఠా తయారు చేస్తుందని పోలీసులు గుర్తించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 72 మందికి నకిలీ సర్టిఫికెట్ లను తయారు చేసి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కొంత మంది ఈ సర్టిఫికెట్ లతో దుబాయ్, సౌదీ అరేబియాకు వెళ్లినట్లు పోలీసులకు కొంత సమాచారం సేకరించారు. కోల్ కత్తా, యూపీలకు చెందిన కీలక ముఠా సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
