తమిళనాడు (Tamil Nadu)లోని పొల్లాచిలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో తీర్పు వెలువరిడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ కోయంబత్తూరు స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది. కోయంబత్తూరులోని మహిళా ప్రత్యేక కోర్టు తొమ్మిది మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 2019లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల కేసు సర్వత్రా సంచలనం సృష్టించింది. అయితే, నిందితులు తొమ్మిది మంది 2019 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిని మంగళవారం కట్టుదిట్టమైన భద్రతతో సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు. నిందితులపై నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, రేప్, గ్యాంగ్ రేప్, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వీరందరినీ దోషులుగా తేల్చింది. మధ్యాహ్నం వీరికి శిక్షను ఖరారు చేసింది.
పొల్లాచి కేసు ఏంటంటే?
కాగా.. 2016-2018 మధ్య కాలంలో ఒక కళాశాల విద్యార్థినితో సహా పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు ఇది. ఈ తొమ్మిది మంది అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం మంది కాలేజీ విద్యార్థినులు ఉన్నారు. ఓ విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. నిందితులు మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా వాటిని మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించారు. వాటిని ఉపయోగించి మహిళలను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఈ కేసును పొల్లాచి పోలీసులు విచారణ చేశారు. ఆ తర్వాత తమిళనాడు క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID)కు బదిలీ చేశారు. ఆ తర్వాత సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసు అప్పట్లో తమిళనాడులో పెద్దఎత్తున సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో బాధితుల తరఫున 200కు పైగా పత్రాలను, 400 ఎలక్ట్రానిక్ పరికరాలను ఆధారాలుగా చూపించారు. ఈ దారుణానికి పాల్పడిన వారందరినీ కఠిన శిక్షను ప్రకటించాలని సీబీఐ న్యాయవాది వాదించారు. మహిళా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా సీబీఐ కోరింది. అరెస్టు అయిన వారిలో అన్నాడీఎంకే వ్యక్తి ఒకరు ఉన్నారు.
