పెహల్గాం ఉగ్రదాడి తర్వాత బారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతుండగా అనూహ్యంగా సీజ్ ఫైర్ ప్రకటన వెలువడింది. భారత్-పాక్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
ఈ ప్రకటన పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ, ప్రజల్లో సంతోషం నింపుతుండగా.. భారత్ లో మాత్రం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం దాడికి కారణమైన పాకిస్తాన్ పై సరైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కితే దాన్ని అనవసరంగా వదులుకున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటన చేశాయి. అనంతరం సరిహద్దుల్లో పరిస్ధితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. అయితే రెండు దేశాల్లోనూ భిన్నమైన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాల్పుల విరమణతో అప్పటివరకూ భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంటోంది. కానీ భారత్ లో మాత్రం అమెరికా మాట విని వ్యూహాత్మక తప్పిదం చేశారా అన్న చర్చ జరుగుతోంది.కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ రోడ్లపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వీడియోలు, అలాగే ఆర్మీ, పౌరులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ను మట్టుబెట్టే అవకాశం దొరికినా భారత్ వదులుకోవడం, తిరిగి చర్చలకు సిద్ధం కావడం వంటి నిర్ణయాలు ఇప్పుడు సగటు భారతీయుల్ని అసంతృప్తికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కాల్పుల విరమణ తర్వాత పరిస్ధితుల్ని నిశితంగా గమనిస్తున్న కేంద్రం.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో వరుసగా చర్చలు జరుపుతోంది. కాల్పుల విరమణతో పబాటు పాకిస్తాన్ తో చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభించిన భారత సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్..కాసేపటికే దీన్ని వాయిదా వేసేశారు. సాయంత్రం తిరిగి మరో దఫా చర్చలు జరిపే అవకాశముంది.
అయితే చర్చల సంగతి ఎలా ఉన్నా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా మాట విని వెనక్కి తగ్గకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సంబరాల వీడియోలు భారతీయుల్లో మరింత ఆగ్రహం రేపుతున్నాయి. చర్చలు ఫలిస్తే సరి లేకపోతే తిరిగి ఆపరేషన్ సింధూర్ కొనసాగించాల్సిందేనన్న భావన సగటు భారతీయుల్లో వ్యక్తమవుతోంది.
