ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే కాదు అమెరికాలోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.
ట్రెండ్‌కు తగ్గట్టు వార్తల్లో నిలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతోనో, వింత చేష్టతోనో నిత్యం వార్తల్లో ఉండాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. ఆయనకు లక్షల్లో అభిమానులు ఉండొచ్చు.. అది వేరే విషయం. తాజాగా ఆయన ఎయిర్‌పోర్టులో అధికారుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా ఎందుకు ఆపుతున్నారంటూ అధికారులను నిలదీశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అసలు ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది? ఆయన టర్కీ ఎందుకు వెళ్తున్నారు? పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
కేఏ పాల్‌ను ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. తాను అన్ని సరైన పత్రాలు చూపించినప్పటికీ అధికారులు తనను ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. అయితే, ఆయన టర్కీ ఎందుకు వెళ్తున్నారనే విషయంపై ఆయన ఒక విచిత్రమైన కారణం చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి తాను టర్కీ వెళ్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవానికి శనివారం సాయంత్రమే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. బహుశా ఈ విషయం కేఏ పాల్‌కు ఇంకా తెలికపోవచ్చు.
అయితే, అసలు ప్రశ్న ఏమిటంటే.. ఇండో-పాక్ మధ్య యుద్ధం ఆపడానికి కేఏ పాల్ టర్కీ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? గత నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్‌కు టర్కీ డ్రోన్‌లను సరఫరా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఏ పాల్ టర్కీ వెళ్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. బహుశా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడి, పాకిస్తాన్‌కు డ్రోన్‌ల సరఫరాను నిలిపివేయమని కోరడానికి ఆయన వెళ్తున్నారని వారు భావిస్తున్నారు.
కేఏ పాల్ తాను గత 37 సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగుతున్నానని చెప్పారు. గత వారం కూడా తాను టర్కీలో ఉన్నానని అన్నారు. ఒకానొక సమయంలో తాను పాకిస్తాన్ కూడా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తనకు వీసా లేకుండానే ప్రపంచ దేశాలు ఆహ్వానం పలుకుతాయని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. తన వీసా, గ్రీన్‌కార్డులను కూడా అధికారులకు చూపించారు. అయితే, తొందరపాటులో ఆయన ఏదో ముఖ్యమైన డాక్యుమెంట్ తీసుకురావడం మరిచిపోయి ఉండవచ్చని కొందరు అంటున్నారు.