బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది.
ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.
అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.
