జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్అహ్మద్ పహల్గాం సంఘటనలో ఉగ్రవాదులకు సహకరించారని అనుమానంతో భద్రత దళాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. ఇంతియాజ్ అహ్మద్ తాను కుల్గాంలోని టాంగ్ మార్గంలో ఉన్న అడవిలో తలదాచుకున్న టెర్రరిస్టులకు ఆహారం, ఆశ్రయం తో పాటు ఇతర సహాయ సహకారాలు అందించినట్టు విచారణలో అంగీకరించాడు. తాను ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహాయం చేస్తానని విచారణలో భద్రతా బలగాలను నమ్మించాడు, దీంతో భద్రత బలగాలు అతన్ని తీసుకుని ఆదివారం ఉదయం అతని వెంట వెళ్లాయి. తప్పించుకోవడానికి ఇదే అదునుగా భావించిన ఇంతియాజ్ అహ్మద్ వేగంగా ప్రవహిస్తున్న వేషా నది సమీపంలోకి వెళ్ళగానే అందులోకి దూకేసాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఈ విషయమై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పిడిపి చీఫ్ మహబూబ్ ముప్తీ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలేడని దీని వెనకాల కుట్రకోణం ఉందని ఆమె విమర్శలు గుప్పించారు. అయితే ఇంతియాజ్ అహ్మద్ నీటిలో దూకిన వీడియో బయటకు రావడంతో ఇందులో భద్రతా బలగాల ప్రమేయం లేదని తెలిసింది. తొలుత ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కాస్త దూరం వెళ్ళాక ప్రవాహంలో మునిగిపోయి చనిపోయాడు. ఈ ఘటన అంతా కెమెరాల్లో నిక్షిప్తమయింది తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి.
